వాస్తవం
నిన్నటి వరకు
పచ్చ చొక్కాలు తొడుక్కున్న
పంట పొలాలన్ని
నేడు గళ్ళ చొక్కాలు తొడుక్కున్నాయి
అప్రువుడ్ లే అవుట్స్ కదా మరి !
సారవంతమైన మట్టి
ఏమీ చేయలేక
నిస్సారంగా నిశ్శబ్దంగా
కస్టమర్స్ ని ఆకర్షించడానికి
వేసిన పలుచటి తారు రోడ్డు క్రింద
సమాధి అవుతోంది
కొన్ని వేల కాలే కడుపులకి
అన్నం పెట్టిన
వేల చదరపు గజాల మట్టి
రిజిస్టర్ ఆఫీసు దస్తావేజుల్లో
చివరి శ్వాస తీసుకుంటుంది
ఒకప్పటి పంట కాలువ
ఎండిపోయి బిక్కు బిక్కు మంటోంది
రైతు చెమట పడ్డ చోటల్లా
గడ్డి పూల చెట్లు
గతానికి సాక్షుల్లా నిలబడ్డాయి
పైరు మీంచి వీద్దామని
వచ్చిన గాలి
స్థాణువై నిట్టూరుస్తోంది
ఎక్కువ ధర వస్తే
ప్లాటు అమ్మి పిల్ల పెళ్లి
చేద్దామాన్న సామాన్యుడి ఆశ
ప్లాటు నలుప్రక్కలా
హద్దు రాళ్ళలా
సగం పాతుకుపోయింది
అమ్మిన రైతు
అప్పులు తీర్చి
పొట్ట చేత పట్టుకుని
పట్నం పోయి
రిక్షా లాగుతూ
చెమటని తారు రోడ్ల మీద
ఆవిరి చేస్తున్నాడు
దళారుల జేబులు
ప్రక్క నున్న
కొండల్లా
ఎత్తుగా
ఠీవిగా మీసం తిప్పుతున్నాయి
ప్రగతి పేరుతో
జరిగే అరాచకాలు దిక్కులు పిక్కటిల్లేలా అట్టహాసం చేస్తున్నాయి
పంట భూముల
ఛాయాచిత్రాలు
పుస్తకాల్లో చూస్తూ
రేపటి పౌరులు
కేరింతలు కొడుతున్నారు
No comments:
Post a Comment